శ్రీశైలం దిగువకు కృష్ణమ్మ పరుగులు

|

Aug 20, 2020 | 2:09 PM

కృష్ణమ్మ పరుగు పరుగునా వచ్చి శ్రీశైలంకు చేరుతోంది. దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. అయితే ఈ సీజన్ లో తొలిసారి జలాశయం గేట్లను తెరిచారు...

శ్రీశైలం దిగువకు కృష్ణమ్మ పరుగులు
Follow us on

కృష్ణమ్మ పరుగు పరుగునా వచ్చి శ్రీశైలంకు చేరుతోంది. దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. అయితే ఈ సీజన్ లో తొలిసారి జలాశయం గేట్లను తెరిచారు. ఐదారురోజులుగా ఆల్మట్టికి భారీ ఇన్‌ఫ్లో వస్తుండటం.. అప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ జలాశయాలు 75 శాతానికి పైగా నిండి ఉండటంతో వరదంతా దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని  ప్రాజెక్టులకు వరద పోటు పెరిగింది.

గత రెండు రోజులుగా కర్ణాటకలోని జలాశయాల నుంచి 2.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ క్రమంలో జూరాల నుంచి కూడా ఇంతకంటే ఎక్కువ అవుట్‌ఫ్లో నమోదవుతుండటం.. తుంగభద్ర డ్యాం కూడా నిండుకుండలా మారి దిగువకు 60 వేల నుంచి 70 వేల క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం దిశగా కృష్ణమ్మ ఉధృతి గంట గంటకూ పెరుగుతున్నది.

బుధవారం సాయంత్రానికి 3.60 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 79,131 క్యూసెక్కులను నదిలోకి నీటిని విడుదల చేశారు. అయితే అప్పటికే ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ద్వారా తెలంగాణ 40,259 క్యూసెక్కులు, కుడి గట్టులో ఏపీ 31,062 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నాయి. ఇలా 1.50 లక్షల క్యూసెక్కుల కృష్ణాజలాలు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి.

మరోవైపు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కూడా నీటివిడుదల పరిమాణాన్ని గణనీయంగా పెంచారు. జలాశయంలో నీటిమట్టం గణనీయంగా ఉండటంతో పోతిరెడ్డిపాడు ద్వారా 37 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లో బుధవారం సాయంత్రానికి 571కిపైగా అడుగుల్లో 261 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉన్నది. సాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కావడంతో పూర్తిస్థాయికి మరో 50 టీఎంసీలకుపైగా జలాలు రావాల్సి ఉన్నది. ఈ స్థాయిలో వరద కొనసాగినా రోజుకు 10 టీఎంసీల చొప్పున ఐదు రోజుల్లో నిండుకుండలా మారనున్నదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా మరో రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.