రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఈరోజు పండుగ రోజుని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పిన ఆమె, 27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారని.. 88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలోనూ మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం గర్వకారణమని చెప్పారు.1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు జగన్ ఊపిరి పోశారని ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రతీ పథకం సీఎం జగన్ మహిళా సాధికారత కోసమే తెస్తున్నారని.. రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ సీఎం జగన్ లాగ మహిళల కోసం చేయలేదని అన్నారు. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, ‘వసతి దీవెన’ పథకాలతో పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారని శ్రీవాణి చెప్పారు. దిశ చట్టం, 30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలిచిందని.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి జగన్ చరిత్ర సృష్టించారని చెప్పారు. ప్రతీ మహిళను తన తోబుట్టువులా చూస్తూ సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ‘వైఎస్సార్ చేయూత’ తో మహిళల స్వయం ఉపాదికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారని పుష్పశ్రీవాణి వెల్లడించారు.