రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని బార్లు, క్లబ్బులు తెరిచేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. తనిఖీలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్ ని రూపొందిస్తున్నామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్‌వోపీని రూపొందించిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎలా చేపట్టాలో పోలీసులకు వివరిస్తామని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, ట్రాఫిక్ పోలీసు చెక్ పాయింట్లను వీలైనంత వరకు తగ్గిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపడుతామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొనే పోలీసులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని అనిల్ కుమార్ తెలియజేశారు.