కోపం జకోవిచ్‌ కొంప ముంచింది, టోర్నీ నుంచి నిష్ర్కమించేలా చేసింది..

|

Sep 07, 2020 | 12:02 PM

ఆవేశం అనర్థదాయకమని, తన కోపమే తన శత్రువని పెద్దలు చెప్పిన హితోక్తులను పట్టించుకోవాలి. అది పెడచెవిన పెట్టినందుకే సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నుంచి అనూహ్యంగా, అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది.

కోపం జకోవిచ్‌ కొంప ముంచింది, టోర్నీ నుంచి నిష్ర్కమించేలా చేసింది..
Follow us on

ఆవేశం అనర్థదాయకమని, తన కోపమే తన శత్రువని పెద్దలు చెప్పిన హితోక్తులను పట్టించుకోవాలి. అది పెడచెవిన పెట్టినందుకే సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నుంచి అనూహ్యంగా, అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది.. ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు ఇలా బహిష్కరణకు గురికావడం వింతే మరి!

అసలేం జరిగిందంటే.. పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్‌, పాబ్లో కార్రెనో బుస్టా మధ్య ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది.. ప్రారంభ సెట్‌లో ప్రత్యర్థి 5-6తో ముందుకు వెళ్లడంతో జకోవిచ్‌ ఒకింత ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు.. ఆటలో కోపతాపాలు సహజమే కాని… జకోవిచ్‌ కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక బంతిని బ్యాట్‌తో కోర్టు బయటకు కొట్టాడు.. .. అది కాస్తా అక్కడే ఉన్న లైన్‌ అంపైర్‌కు బలంగా తలిగింది.. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది.. వెంటనే టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌స్లామ్‌ ఆండ్రియాస్‌ ఫీల్డ్‌లోకి వచ్చేసి జకోవిత్‌తో మాట ముచ్చట జరిపారు.. తప్పయిపోయిందంటూ జకోవిచ్‌ వేడుకున్నాడు.. లైన్‌ అంపైర్‌కు కూడా క్షమాపణ చెప్పాడు.. అధికారులు తనపై చర్యలు తీసుకోక ముందే జకోవిచ్‌ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.

తెలిసో తెలియకో చేసింది మాత్రం పెద్ద తప్పే కాబట్టి మ్యాచ్‌ నుంచి జకోవిచ్‌ నిష్ర్కమిస్తున్నట్టు ఫ్రీమెల్‌ ప్రకటించారు.. కోర్టులో ఆటగాడు కావాలని ప్రమాదకరంగా బంతిని విసరడం టెన్నిస్‌ నిబంధనలకు విరుద్ధం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు.. యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కూడా ఇదే చెప్పింది. నిబంధనల ప్రకారమే ఫ్రీమెల్‌ జకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించారని ప్రకటించింది. టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాదు… ఇప్పటి వరకు టోర్నీలో సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు రెండున్నర లక్షల నగదు బహుమతిని కూడా జకోవిచ్‌ కోల్పోయాడు. పాపం 26-0 విజయాలతో జకోవిచ్‌ ఈ టోర్నీలో టైటిల్‌కు దగ్గరగా వచ్చేసిన జకోవిచ్‌ ఇలా నిష్ర్కమిస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇప్పటి వరకు 17 గ్రాండ్‌ స్లామ్‌లను సాధించిన జకోవిచ్‌కు యూఎస్‌ టోర్నీ నిరాశనే మిగిల్చింది. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉన్న రోజర్‌ ఫెదరర్‌, 19 టైటిళ్లతో సెకండ్‌ప్లేస్‌లో ఉన్న రఫేల్‌ నాదల్‌ను అధిగమించాలన్నది జకోవిచ్‌ కల. యూఎస్‌ టోర్నీలో వీరిద్దరు పాల్గొనకపోవడంతో జకోవిచ్‌ కల త్వరలో సాకారమవుతుందనుకున్నారంతా..