సెంట్రల్ గవర్నమెంట్..అసంఘటిత రంగంలోని పేద ప్రజలు లబ్ది పొందడానికి అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో చేరిన వారికి రిటైర్మెంట్ అనంతరం ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్ వస్తుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. కనీసం రూ.1000 పింఛన్ పొందే సౌలభ్యం ఉంది. మీరు చెల్లించే మొత్తంపై బట్టి మీకు వచ్చే పెన్షన్ నిర్ణయిస్తారు. రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. నెలకు రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే నెలకు రూ.210 కట్టాల్సి ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకంలో జాయిన్ అవ్వొచ్చు. నామినీ లేదా భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
చెల్లించాలనుకునే మొత్తాన్ని నెల వారీగా లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లించొచ్చు. ఆటో డెబిట్ సౌలభ్యం ఉంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గానే కట్ అవుతాయి. పథకంలో చేరిన వారికి పీఆర్ఏఎన్ కార్డు ఇస్తారు. దీని ద్వారా మీ ఖాతాలో లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే అప్పుడు రూ.1000 పింఛన్ కోసం నెలకు రూ.42 చెల్లిస్తే చాలు. అదే రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 పే చెయ్యాలి. అదే మీరు 40 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే రూ.5,000 కోసం రూ.1454 చెల్లించాలి. అదే రూ.1,000 కోసం అయితే నెలకు రూ.291 కట్టాలి. రూ.3 వేల పింఛన్ కోసం నెలకు రూ.126 నుంచి రూ.873 చెల్లించాలి.