కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్-హర్యానా రైతులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ, రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్, భారతీయ కిసాన్ యూనియన్ లోని వివిధ సంఘాలు ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు బుధవారం వందలాది రైతులు తమ ట్రాక్టర్ ట్రాలీలతో సహా పంజాబ్-హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు. ఢిల్లీ మార్చ్ కు సిధ్ధమయ్యారు. హర్యానా ప్రభుత్వం 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించగా..ఢిల్లీ పోలీసులు నగరంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎవరు ఢిల్లీకి వఛ్చినా లీగల్ చర్య తీసుకుంటామని వారు హెచ్చరించారు. పైగా ఇక్కడ కోవిడ్ మహమ్మారి కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్, హర్యానా తో బాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ నెల 26 న ఢిల్లీ చలో అంటూ మూకుమ్మడిగా మార్చ్ కు రెడీ అవుతున్నారు. కాగా వివిధ రైతు సంఘాలు చేసిన అభ్యర్థనలను తాము తొసిపుచ్ఛుతున్నట్టు ఢిల్లీ పోలీసులు తమ ట్విటర్ ద్వారా తెలిపారు.