Cp Sajjanar Released a Short Film : సినీ, టీవీనటులు ధన్‌రాజ్, వేణును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. రోజు రోజుకు పెరిగిపోతున్నసైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ అందిరిని ఆకట్టుకుంది. ఆ షార్ట్‌ఫిల్మ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ఛాంబర్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీఐపీలు, సెలబ్రిటీల పేర్లతో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు వీఐపీలు, సెలబ్రిటీలు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలనే టార్గెట్ చేస్తున్నారని.. అక్షరం తేడాతో అసలు ఐడీలను పోలిన.. నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టిస్తున్నారని తెలిపారు.
వీఐపీలు, సెలబ్రిటీలు, ప్రముఖుల పేర్లను అడ్డం పెట్టుకుని నకిలీ ఖాతాల ద్వారా స్వయంగా వారే చాట్ చేస్తున్నట్లు భావన కల్పిస్తూ మోసాలకు దిగుతున్నారని అన్నారు. ఈ విషయమై వీఐపీలు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
నకిలీ ఐడీలు ఉంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దని ప్రజలను కోరారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన ధన్‌రాజ్‌ను, షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటర్ హైమను, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డింగ్ చేసిన గాయత్రి స్టూడియోస్ ప్రతినిధిని సజ్జనార్ అభినందించి సన్మానించారు.