Covid19 Cases Spike : ముంచుకొస్తున్న పెళ్లి ముహూర్తాల వేళలు, రాజస్తాన్ అధికారులలో ఆందోళనలు
ఉత్తరాదిలో చలిగాలులతో పాటు కరోనా వైరస్ కూడా గజగజమని వణికిస్తోంది. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదు చాలామంది..
ఉత్తరాదిలో చలిగాలులతో పాటు కరోనా వైరస్ కూడా గజగజమని వణికిస్తోంది. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని నెత్తినోరు మొత్తుకుని చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదు చాలామంది.. ఇంత సందుదొరికితే జొరపడతామని చూస్తున్న కరోనాను రారమ్మంటూ పిలుస్తుంటే రాకుండా ఉంటుందా! అందుకే విజృంభిస్తోంది అక్కడ.. రాజస్తాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.. ఇదే సమయంలో దివ్యమైన ముహూర్తాలు మరింత భయపెడుతున్నాయి.. కేసులు పెరుగుతున్నాయని సుముహూర్తాలలో జరుపుకునే పెళ్లిళ్లను వాయిదా వేసుకోలేం కదా అంటూ వేలాది జంటలు వివాహానికి సిద్ధమవుతున్నాయి. రాజస్తాన్‌లో ఇది పెళ్లిళ్ల సీజన్! ఈ నెల చివరి వరకు పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఒక్క జైపూర్‌లోనే రికార్డు స్థాయిలో నాలుగు వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.. ఇది అధికారులకు ఆందోళన కలిగిస్తోన్న అంశం.. సామూహికంగా జరుపుకునే ఇలాంటి వేడుకల ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. పెళ్లిళ్లలకు హాజరయ్యే అతిథుల సంఖ్య వంద మందికి మించి ఉండకూడదన్న ఆదేశాలు ఉన్నా ఆ వంద సంఖ్య ఇప్పుడు ప్రమాదకరంగా మారింది.. పెళ్లికి వచ్చే అతిథులు సరేసరి! అదే హాల్‌లో క్యాటరింగ్ వారుంటారు.. బ్యాండ్‌వాళ్లు ఉంటారు. పురోహితులు ఉంటారు.. మండపాన్ని అలంకరించేవారు ఉంటారు.. వీరిలో ఎవరైనా కరోనా పాజిటివ్ వారు ఉంటే ఇట్టే మిగతారికి అది అంటుతుంది.. ఇప్పటికే రాష్ట్రంలో రోజుకు మూడు వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పుడు శుభకార్యాలంటే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెళ్లిళ్లు చేసుకుంటే చేసుకున్నారు కానీ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లను వాడటం వంటివి చేయడంటూ ప్రభుత్వం చెబుతోంది.. జనం వినిపించుకుంటారా అన్నదే అనుమానం.. ఇప్పటికే బరాత్‌లను నిషేధించింది ప్రభుత్వం.. కోవిడ్ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలను విధిస్తామని చెప్పినా లైట్ తీసుకుంటున్నారు.