ఎక్కడో చైనాలోని వూహన్ లో పుట్టిన కొవిడ్ -19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది…ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రకంపనలు సృష్టస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి రుయా ఆస్పత్రిలో చేరాడు. దీంతో జిల్లావాసులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
రుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఒక రోగి చికిత్స నిమిత్తం చేరాడు. చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ బంగారుపాళ్యెం దగ్గరున్న ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మత్తులు చేసేందుకు ఇండియాకు వచ్చాడు. గత రెండురోజులుగా తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో రుయా ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆ యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తనమూనాలను సేకరించారు. మరో రెండురోజుల్లో అతనికి కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని వైద్యులు తేల్చనున్నారు.
చైనాలోని వుహాన్ ప్రావిన్స్ నుంచి ప్రపంచానికి పాకిన ఈ కోవిడ్19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 83,000 మందికి కరోనా వైరస్ వ్యాప్తిచెందినట్టు నిర్ధారించారు. కరోనా వైరస్ భయంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే భారత స్టాక్ మార్కెట్లలో రూ.5లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.