
హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో వచ్చిన వార్త కథనంపై కలెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కలెక్టర్ల వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.. కలెక్టర్లందరూ కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోడానికి సమాయత్తమవుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకుంటున్నారు.. వీలైతే పరువునష్టం దావా వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు వెళుతున్నాయని కలెక్టర్ తెలిపారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడంలో, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో, వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా దేశంలోనే ఏపీలో కలెక్టర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చిందన్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని, కలెక్టర్లందరికీ ప్రజల్లో మంచి పేరు వచ్చిందని వివరించారు. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే అర్థం పర్థం లేని కథనాలతో దాడిగి దిగుతున్నారని తెలిపారు. దురుద్దేశపూర్వకంగా కలెక్టర్ల వ్యవస్థనే దెబ్బతీయడానికి ఇలాంటి కథనాలను వండి వారుస్తున్నారన్నారు. తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ సాగుతోందని, కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు కలెక్టర్లు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి తీరు గర్హనీయమని తెలిపారు. వీటిని చూస్తూ ఊరుకుంటే..స్వేచ్ఛగా పనిచేయలేము కాబట్టే చట్టప్రకారం ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్లు వివరించారు.