Co-win App: ‘కొ-విన్ యాప్’..ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి.. ఎప్పుడు నమోదు చేసుకోవాలంటే?
దేశవ్యాప్తంగా జరగనున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను రియల్‌టైంలో పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 'కొ-విన్' అనే యాప్‌ను అభివృద్ధి చేసింది.

Co-win App: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాలు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో మూడు కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా పంపిణీ చేయనున్నారు.
ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా జరగనున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను రియల్‌టైంలో పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘కొ-విన్’ అనే యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా టీకా పంపిణీ జరగనుంది. త్వరలోనే ఈ యాప్ సాధారణ ప్రజలకు గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ప్రస్తుతం ప్రీ-ప్రోడక్ట్ దశలో ఉంది. ఇప్పటివరకూ సుమారు 75 లక్షల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
టీకా కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
సామాన్య ప్రజలు టీకా కోసం రిజిస్టర్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇటీవల కొ-విన్ అనే వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా త్వరలోనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ముందుగా కొ-విన్ పోర్టల్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ నమోదు చేస్తే.. పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇక ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి.. ఫోటో ఐడీ కార్డు అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఒకవేళ మీ ఆధార్ కార్డుపై చిరునామా, పుట్టిన తేదీ లేకపోతే.. వాటిని మీరు స్వయంగా ఎంటర్ చేయవచ్చు. వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత ‘డెమో అథెంటికేషన్’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అన్ని కరెక్ట్ ఉంటే గ్రీన్ టిక్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీకా ఎప్పుడు.? ఎక్కడ వేస్తారన్న వివరాలు మొబైల్ నెంబర్‌కు వస్తాయి.
కో-విన్‌లో పేరు ఎప్పుడు నమోదు చేసుకోవాలి?
ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్ వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. సామాన్య ప్రజల వివరాల నమోదుపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది. అప్పుడు యాప్ లేదా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
టీకా సెషన్‌ను ఎవరు.. ఎలా నిర్ణయిస్తారు?
ఏయే కేంద్రాల్లో టీకాలు ఎప్పుడు వేయాలి? ఎన్ని సెషన్లలో ఎంతమందికి వేయాలన్న అంశాలను జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. ఇక టీకా సెషన్‌ను కలెక్టర్ ఖరారు చేస్తారు. టీకా కేంద్రాలు, టీకాలు వేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, టీకా వేయించుకునే వారు అనే విషయాలను సైతం కలెక్టరే నిర్ణయం తీసుకుంటారు.
టీకా కేంద్రం ఎలా ఉంటుంది?
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను టీకాలు వేసే సెషన్ సైట్‌లుగా ఉపయోగిస్తారు. మారుమూల ప్రాంతాల్లో అయితే పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను వినియోగించుకుంటారు. టీకా కేంద్రంలో మూడు విభాగాలు ఉంటాయి. 1. వెయిటింగ్ రూం, 2. వ్యాక్సినేషన్ రూం, 3. అబ్జర్వేషన్ రూం.
ఫేక్ యాప్స్‌ను నమ్మొద్దు…
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ యాప్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో ‘కొ-విన్’ పేరుతో ఉన్న ఫేక్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని.. అధికారికంగా ప్రకటించి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.




