తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?

|

Nov 22, 2019 | 5:39 PM

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్‌నేమ్స్‌ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా వున్నవారితోపాటు ఆ తర్వాత సంబంధిత వార్తలు వినేవారు, చదివే వారు కూడా మనసారా నవ్వుకునే ఛాన్స్ దక్కుతుంది. ఇలాంటి పొలిటికల్ అండ్ సెటైరికల్ నిక్‌నేమ్స్‌లో మనకు బాగా గుర్తుండిపోయింది ‘‘బిగ్ బాస్ ’’ పదం. 2003లో విపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి సీఎల్పీ […]

తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?
Follow us on

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్‌నేమ్స్‌ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా వున్నవారితోపాటు ఆ తర్వాత సంబంధిత వార్తలు వినేవారు, చదివే వారు కూడా మనసారా నవ్వుకునే ఛాన్స్ దక్కుతుంది. ఇలాంటి పొలిటికల్ అండ్ సెటైరికల్ నిక్‌నేమ్స్‌లో మనకు బాగా గుర్తుండిపోయింది ‘‘బిగ్ బాస్ ’’ పదం.

2003లో విపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి సీఎల్పీ కార్యదర్శి, మాజీ మంత్రి మైసూరారెడ్డి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీ వేదికగా.. ముడుపులు పొందిన బిగ్ బాస్ ఎవరు ? అంటూ పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన కామెంట్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలనే కాకుండా.. లైవ్ చూస్తున్న వారందరినీ అలరించాయి.

ఆ తర్వాత పలు సందర్భాలలో తమ తమ రాజకీయ ప్రత్యర్థులకు నిక్ నేమ్స్ తగిలించడం కూడా కొనసాగింది. తాజాగా తెలంగాణలో మరోసారి రాజకీయ ప్రత్యర్థులపై నిక్ నేమ్స్ తగిలించి మరీ విమర్శించిన ఉదంతం చర్చనీయాంశమైంది. గతంలో దాదాపు అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో కల్పించుకుంటూ అత్యంత కీలకంగా వ్యవహరించిన చింటూ , పింటూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ విలేకరులతో మాట్లాడారు. కెసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టేసి మరీ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని వారు ఆరోపించారు. రైతు బంధు ఆగిపోయిందని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదని, ఆర్టీసీ విషయంలో సర్కార్ వైఖరి మొండితనంగా వుందని దయాకర్, సంపత్ విమర్శించారు.

ఇలా విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేతలు.. ‘‘ఇంత జరుగుతున్నా చింటూ, పింటూల జాడ లేదని’’ కామెంట్ చేయడంతో అక్కడున్న విలేకరులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ చింటూ, పింటూ ఎవరని కొందరు అడగడంతో గాంధీభవన్‌లో నవ్వులు పూసాయి. గతంలో ప్రతీ విషయంలో జోక్యం చేసుకున్న కేటీఆర్‌, హరీష్‌లు ఎక్కడ పోయారంటూ.. చింటూ అంటే కెటీఆర్ అని, పింటూ అంటే హరీశ్ రావ్ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీరిద్దరు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రుల్లో పదవీ భయం వుందని అందుకే ఎవరూ ఏమీ మాట్లాడడం లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు.