Chinna Jeeyar Swamy on CM KCR: తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆయన సహకారంతోనే సమతామూర్తి (Sri Ramanunjacharya) వెయ్యేళ్ల పండుగ కార్యక్రమంవిజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నేను మొదటి వాలంటీర్‌ను అని కేసీఆరే స్వయంగా అన్నారని ఈ సందర్భంగా చినజీయర్ స్వామి గుర్తు చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ(Statue of Equality) మహోత్సవానికి సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం, పని ఒత్తిడి అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు, తనకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని చినజీయర్ హితవు పలికారు. తమకు అందరూ సమానమేనని చెబుతూ.. ప్రతిపక్షం, స్వపక్షం రాజకీయాల్లోనే ఉంటాయని అన్నారు. భగవంతుడి దృష్టిలో అంతా ఒక్కటేనన్నారు.
ఈ క్రమంలోనే ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగియటంతో రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు చిన జీయర్ స్వామి వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు. శ్రీరామానుజాచార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామన్న ఆయన.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రేపటి కార్యక్రమానికి కూడా అందరినీ ఆహ్వానించామని తెలిపారు.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించామని చెప్పారు.
అరబిక్ భాషలో కూడా ఆహ్వాన పత్రికలను అచ్చువేయించామని వెల్లడించారు. ఇక, రామానుజ చార్యుల విగ్రహాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.. వీలు అయితే ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తి దర్శనంకు కార్యనిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. రేపు 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని వివరించారు. రేపు నిర్వహించే శాంతి కల్యాణానికి కూడా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు.అయితే ఆయన వస్తారో.. రారో చూడాలని చిన్న జీయర్‌స్వామి పేర్కొన్నారు.
ఇదిలావుంటే, సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ రాగా.. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అంతకు ముందు తాను ప్రధానిని ప్రోటోకాల్ ప్రకారం స్వాగతిస్తానని సీఎం తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్ కు జ్వరం కారణంగా ప్రధాని పర్యటనకు హజరు కాలేదు. ఇదే కారణం చేత దూరంగా ఉన్నట్లుగా నాలుగు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలోనూ కేసీఆర్ వెల్లడించారు. ఇక, చినజీయర్ స్వామితో విభేదాల అంశం పైన ఈ రోజున స్వయంగా చిన జీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అయితే, శనివారం ముచ్చింతల్‌లో జరిగే శాంతి కళ్యాణానికి సీఎం కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.