Chennai Hotel Goes Viral: సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది. అలాగే చిన్న హోటళ్లలో అయితే ఫుల్ మీల్స్ రూ.70 నుంచి రూ.100 ఉంటుంది. కానీ చెన్నైలోని ఓ హోటల్‌లో కేవలం రూ.10కే ప్లేట్ భోజనం.. అలాగే రూ.30కే ఫుల్ మీల్స్ లాగించేయవచ్చు. అదీ కూడా అక్కడ సిబ్బంది ఏసీ గదిలో వడ్డిస్తారు. రజనీకాంత్ అభిమాని ఒకరు చెన్నైలోని సాలి గ్రామంలో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.
స్థానిక కార్మికులకు, రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే రేట్లతో స్టార్ హోటళ్లకు ధీటుగా యాజమాన్యం ఈ హోటల్‌ను నడుపుతోంది. అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగను వడ్డిస్తూ పేదవారి ఆకలి తీరుస్తోంది. మధ్యాహ్నం వేళల్లో ఈ హోటల్ కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండటంతో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడికి భోజనానికి వెళ్తున్నారు. ఇక ఆ హోటల్ యజమాని వీరబాబు మాట్లాడుతూ కేవలం సేవా దృక్పధంతోనే ఈ హోటల్‌ను పెట్టామని స్పష్టం చేశాడు. కాగా, రజనీకాంత్ వీరాభిమానులు మరికొందరు ఇలాంటి హోటల్స్‌ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది.