రాజధాని విభజనకు బ్రేక్! : టీడీపీ సూపర్ ప్లాన్

|

Jan 18, 2020 | 5:51 PM

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అన్ని యత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకునేందుకు సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ద్విముఖ వ్యూహాన్ని చంద్రబాబు సిద్దం చేశారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు యాక్షన్ ప్లాన్ వందశాతం అమలైతే.. రాజధాని వికేంద్రీకరణకు కచ్చితంగా బ్రేక్ పడుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. జనవరి 20 నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం హైపవర్ కమిటీ నివేదిక రావడం, […]

రాజధాని విభజనకు బ్రేక్! : టీడీపీ సూపర్ ప్లాన్
Follow us on

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అన్ని యత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకునేందుకు సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ద్విముఖ వ్యూహాన్ని చంద్రబాబు సిద్దం చేశారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు యాక్షన్ ప్లాన్ వందశాతం అమలైతే.. రాజధాని వికేంద్రీకరణకు కచ్చితంగా బ్రేక్ పడుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.

జనవరి 20 నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం హైపవర్ కమిటీ నివేదిక రావడం, కేబినెట్‌లో చర్చించడం.. అసెంబ్లీ తొలి రోజునే సభలో రాజధానుల అంశం ఎజెండాకెక్కడం జరగాల్సి వుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ వర్గాలు సమాయత్తం అవుతుండగా.. రాజధాని వికేంద్రీకరణకు బ్రేక్ వేసేందుకు విపక్ష టీడీపీ రెడీ అవుతోంది. ఇందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.

ఆదివారం ఉదయం పదిన్నరకు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. దానికి ఎమ్మెల్యేలతోపాటు … ఎమ్మెల్సీలందరూ విధిగా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం బిల్లు రూపంలో రాజధాని మార్పులను సభ ముందుకు తెస్తే.. అసెంబ్లీలో అడ్డుకునేందుకు ప్రయత్నించాలని, తమ ప్రసంగాలతో ప్రభుత్వ ధోరణిని ఎండగట్టాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. అయితే, ఏం చేసినా అసెంబ్లీలో బిల్లును అడ్డుకోలేని పరిస్థితి (ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా) వుంది కనుక.. శాసనమండలిలో రాజధాని విభజన బిల్లును ఓడించి తీరాలన్నది టీడీపీ అధినేత వ్యూహమని అంటున్నారు. బిల్లు రూపంలో అయితే.. అసెంబ్లీ ఆమోదంతోనే జగన్ ప్రభుత్వ యత్నాలు నిలిచిపోయే అవకాశం వుంది. ఎందుకంటే మండలిలో టీడీపీకి 29 మంది సభ్యులున్నారు… బీజేపీకి ఇద్దరు సభ్యులున్నారు. మొత్తం 31 మంది ఎమ్మెల్సీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే.. బిల్లు ముందుకు సాగడం కష్టం.

బిల్లు రూపంలో కాకుండా.. తీర్మానం రూపంలో వచ్చినా.. ప్రభుత్వానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం దక్కకుండా చేయడమన్నది చంద్రబాబు ప్లాన్ అని తెలుస్తోంది. అటు శాసన మండలిలో ఆ తీర్మానాన్ని ఓడించడంతోపాటు.. రాజధాని అమరావతిలోనే వుండాలంటూ ప్రైవేటు తీర్మానాన్ని టీడీపీ ప్రతిపాదించనున్నది. దానికి బీజేపీ, పీడిఎఫ్ సభ్యులు కూడా ఆమోదం తెలుపుతారు కాబట్టి.. తమ ప్రైవేటు తీర్మానమే నెగ్గుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

ఈ ద్విముఖ వ్యూహానికి తోడు.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలతో సోమవారం (జనవరి 20న) అసెంబ్లీ ఏరియాను దిగ్బంధించాలని టీడీపీ పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ముందస్తుగా ఆంక్షలకు తెరలేపిందంటున్నారు. రాజధాని విభజన అంశం సోమవారం రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానుంది. సంబంధిత కేసులో టీడీపీ తరపున ఇంప్లీడ్ కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వున్నట్లు మరో వర్గం చెబుతోంది. మొత్తానికి రాజధాని విభజనను అడ్డుకునేందుకు యధాశక్తి బరిలోకి దిగేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు.