మా ప్రొడక్ట్స్ ఎన్నేళ్లయినా చెక్కుచెదరవ్..ఎటువంటి డ్యామేజ్ జరగవ్..మేము గ్యారంటీ..ఇది చాలామంది వారి ఉత్పత్తులను సేల్ చేసేటప్పడు చెప్పే మాట. వస్తువుల విషయంలో ఓకే కానీ ఆహార పదార్థాల విషయంలో ఇలాంటి మాటలు చెప్పగలరా..?. నో వే.. కానీ అలాంటి మాటలే చెప్పి..వాటిని ఫ్రూవ్ చేసుకుంది మెక్ డోనల్డ్స్ సంస్థ.
సదరు సంస్థ ఐస్‌ల్యాండ్‌లోని తమ రెస్టారెంట్లన్నింటినీ 2009లో మూసేసింది. అప్పుడు జెర్టర్ స్మారసన్ అనే వ్యక్తి మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లి కంపెనీ అమ్మిన ఆఖరి బర్గర్‌ను, దానితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను కొన్నారు. మెక్ డోనల్డ్స్ ఆహార పదార్థాలు ఎన్ని రోజులు గడిచినా పాడైపోవని ప్రచారం జరుగుతుండటంతో…ఆ లెక్క ఏంటో తేల్చాలని భావించాడు. ఈ పదేళ్లలో ఈ బర్గర్ అనేక ప్లేసులు షిప్ట్ అవుతూ వచ్చింది. మొదట బర్గర్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను.. స్మారసన్ ఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టి కొన్నాళ్లపాటు తన గ్యారేజ్‌లో పెట్టారు. మూడేళ్లైనా ఎటువంటి డ్యామేజ్ లేకపోవడంతో..నేషనల్ మ్యూజియం ఆఫ్ ఐస్‌ల్యాండ్‌కు దాన్ని ఆయన ఇచ్చారు. అనంతరం వివిధ కారణాల వల్ల అది వివిధ చోట్లకు ప్రయాణించి చివరకు స్నోట్రా హౌజ్‌కు చేరింది.
కాగా ఇటీవలే ఆ బర్గర్‌కు పదేళ్లు నిండాయి. వారు చెప్పినట్టే అది మన్నికగానే ఉంది. దీంతో దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని స్నోట్రా హౌస్ అనే హోటల్‌లో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. దీంతో ఆ బర్గర్‌ను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. అంతేకాదు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌కి కూడా విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. కాగా మెక్ డోనల్డ్స్ ఆహార పదార్థాలతో ఇలాంటి ప్రయోగాలు ఇంతకుముందూ జరిగాయి.