
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనావైరస్ ను గుర్తించేందుకు.. వైద్య, ఆరోగ్య శాఖ అనేక పద్దతులు అవలంభిస్తోంది. కోవిడ్ సోకిన వ్యక్తిని గుర్తించి వ్యాధి లక్షణాలు నిర్ధారిస్తున్నారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరికరాలను ఉపయోగిస్తున్నారు. కొన్ని సమయాల్లో వైద్య సిబ్బంది సైతం కొవిడ్ బారినపడుతున్నారు. దీంతో బ్రిటన్ శాస్ర్తవేత్తలు ఓ ముందడుగు వేశారు.
కరోనావైరస్ లక్షణాలను గుర్తించేందుకు ప్రత్యేక జాగిలాను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు మొదలు పెట్టారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఇదీ గనక సక్సెస్ అయితే అత్యంత వేగంగా రోగుల నుంచి ఎలాంటి హాని లేకుండా కరోనా సోకిన వ్యక్తుల్ని గుర్తించేందుకు వీలవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
దీనిపై ప్రఖ్యాత లండన్ స్కేల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్, డర్హమ్ యూనివర్సిటీలతో పాటు మరో స్వచ్ఛంధ సంస్థ కలిసి పరిశోధనలు మొదలు పెట్టాయి. ఈ పరిశోదనల కోసం బ్రిటన్ ప్రభుత్వం 5 లక్షల పౌండ్లు (దాదాపు నాలుగున్నర కోట్లు రూపాయలు) విడుదల చేసింది.
ఇప్పటికే కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తిస్తున్నాయి జాగిలాలు. అలాగే కొవిడ్ 19ను కూడా సులువుగా గుర్తించగలవని పరిశోధనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు బ్రిటన్ మంత్రి జేమ్స్ బెత్తెల్. వైద్య శాస్త్రవేత్తల పరిశోధనాలు సత్ఫలితాలు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జాగిలాలు వాసనతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు, మలేరియా వంటి రోగులను ఇప్పటికే గుర్తించిన విషయాన్ని జేమ్స్ గుర్తు చేశారు.
ప్రస్తుతం కొవిడ్ 19 గుర్తించేందుకు లాబ్రడర్, స్పానియల్ జాతికి చెందిన ఆరు జాగిలాలకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతమైతే ఒక్కో జాగిలం గంటలకు 250 మందిని పరీక్షించగలుగుతాయని శాస్త్రవేత్త అశాభావం వ్యక్తంచేశారు. అంతేకాకుండా విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ వైరస్ ఉన్నవారిని సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ దేశాలు కూడా వైరస్ ను గుర్తించేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం.