
రాష్ట్రంలో రోజు రోజుకి నీటి కొరత ఏర్పడుతోంది. వానలు పడటం ఆలస్యం కావడంతో భూగర్భ జలమట్టంపై ప్రభావాన్ని చూపుతోంది. ప్రతియేటా జూన్ 12వ తేదీ నాటికి అటూ ఇటుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుంటాయి. రుతుపవనాల రాకకు ముందు నుంచే వాతావరణం చల్లబడి చెదురుముదురు వర్షాలు కురుస్తుంటాయి. వీటి సంఖ్య తగ్గిపోవడంతో లోటు వర్షపాతం నమోదయింది. దీనికి తోడు 2018-19 సంవత్సరంలో 18 శాతం లోటు వర్షపాతం నమోదయింది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో 20 శాతం భూభాగంలో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. జిల్లాల్లో వేలాది బోర్లు నీళ్లులేక బావురుమంటున్నాయి. ఇక గ్రామాల్లో నివసించే ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరో వైపు వానలు ఎప్పుడు వస్తాయా అని అన్నదాత ఎదురుచూస్తున్నాడు.
ఒకవేళ అనుకున్నట్లుగా ఇప్పుడు వర్షాలు కురిసినా భూగర్భ జలం తిరిగి పుంజుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. మరోపక్క వర్షాలు క్రమం తప్పకుండా కురవకపోతే ఖరీఫ్ సాగుకోసం రైతులు బోర్ల పై ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఇటు బోర్లలో నీరు లేక వర్షాలు పడక అన్నదాత దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రాష్ట్రంలో ప్రతియేటా జూన్-మే నెలల మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతం 904 మిల్లీమీటర్లు. కాని ఈ ఏడాది 18 శాతం లోటుతో 738 మిల్లీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో 19 జిల్లాల పరిధిలోని 299 మండలాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదయింది.