ఎవరైనా ఏడిస్తే కంట్లో నుంచి నీరే వస్తుంది. కానీ పులివెందులలో ఓ బాలిక కంటిలో నుంచి రక్తం వస్తుంది. మామూలుగా ఏదైనా శరీరంలో వేడిమి ఉంటే, లేదా ఏదైనా గాయమైతే చెవి, ముక్కు, నోటి నుండి రక్తం వచ్చే సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ బాలికకు కన్నీటికి బదులు రక్తం వస్తుంది. అది ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా అర్థం కాని పరిస్థితిగా మారింది. పులివెందులలోని పలు స్థానిక ఆసుపత్రిలో చిన్నారికి చూపించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మెరుగైన చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేక బాలిక, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందుల మండలం చిన్న రంగాపురం గ్రామానికి చెందిన యువరాజు, జ్యోతిలకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద అమ్మాయి పాలాక్షి చాలా అరుదైన సమస్యతో బాధ పడుతుంది.
పాలాక్షి పులివెందులలో 8వ తరగతి చదువుతోంది. ఏమైందో ఏమో కానీ ఈ అమ్మాయికి గత 15 రోజులుగా రోజుకు 4 నుంచి 5 సార్లు కంటిలో నుంచి రక్తం కారుతోంది. రక్తం కారుతున్న సమయంలో నొప్పిగా ఉంటుందని అమ్మాయి పాలాక్షి చెబుతోంది. అమ్మాయికి కడప, పులివెందుల, అనంతపురంలోని ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించామని కానీ ఫలితం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పులివెందులలో ఒక డాక్టర్ తమిళనాడులోని వేలూరు సిఎంసి కి వెళ్ళమని సూచించారని అక్కడ పరీక్షలకే దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వెళ్లాలంటే అంత స్తోమత తమకు లేదని దాతలు ఎవరైనా దయతలిస్తే మా పాపకు వైద్యం చేయించుకుంటామని పాలక్షి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.