BJP trying to get Alagiri: తమిళ రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. సొంత తమ్ముడు ఎం.కే.స్టాలిన్‌తో సఖ్యత లేని డీఎంకే నేత అళగిరి వేరు కుంపటికి సిద్దమవుతున్న తరుణంలో ఆయనకు గాలమేసే ప్లాన్ మొదలు పెట్టింది కమలం పార్టీ. తమిళనాట ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపీ నేతలు అందుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. ఒకవైపు తమిళనాడును మూడు, నాలుగు దశాబ్దాలుగా ఏలిన కరుణానిధి, జయలలిత మరణించడంతో ఏర్పడిన గ్యాప్‌ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఆ ఇద్దరు లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఇదే తగిన సమయమని కమలనాథులు భావిస్తున్నారు.
మరోవైపు సొంత తమ్ముడు స్టాలిన్‌తో సఖ్యత లేని కరుణానిధి మరో తనయుడు అళగిరి వేరు కుంపటికి సిద్దమవుతున్నారు. సొంత పార్టీ ఏర్పాటు దిశగా అళగిరి అడుగులు వేస్తున్నట్లు తమిళనాట కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20వ తేదీన అళగిరి తన మద్దతు దారులతో సమావేశం కాబోతున్నాడు. దక్షిణ తమిళనాడుపై పట్టున్న అళగిరి తన సమావేశానికి మధురైని ఎంచుకున్నారు. అయితే.. ఇదే అదనుగా బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగుతున్నట్లు తాజాగా తెలుస్తోంది. నవంబర్ 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటనకు వెళుతున్నారు. ఆ సందర్భంలోనే అమిత్ షా.. అళగిరితో భేటీ అవుతారని తెలుస్తోంది.
అళగిరిని బీజేపీ వైపు లాగేందుకు కమలనాథులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ విధానాలను గట్టిగా వ్యతిరేకించే ద్రవిడ నేత కరుణానిధి తనయుడు కాషాయతీర్థం పుచ్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, అళగిరిని బీజేపీలో చేర్చుకుంటే అది డీఎంకే అవకాశాలను బాగా దెబ్బతీసేందుకు ఉపయోగపడుతుందన్నది రాజకీయ పరిశీలకుల అంఛనా. దక్షిణ తమిళనాడుపై పట్టున్న అళగిరిని కోల్పోతే ఆ ప్రాంతం నుంచి డీఎంకే వర్గాలు పెద్ద ఎత్తున పార్టీని వీడతాయి. మరోవైపు ఖుష్బూ లాంటి జనాకర్షణ నేతను ఇదివరకే చేర్చుకున్న బీజేపీ.. అళగిరి లాంటి రాజకీయ వ్యూహకర్తలను కూడా చేర్చుకుంటే ఎంతకాలంగానే ఊరిస్తున్న పట్టు తమిళనాడులో బీజేపీకి దక్కే అవకాశం వుంది.
అళగిరి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ తమిళనాడు యూనిట్ అధ్యక్షుడు మురుగన్ అంటున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులకు ఈ వారం, పది రోజులు కీలకం కానున్నాయి. పలు రాజకీయ పార్టీలకు వేదిక అయిన తమిళనాడులో వచ్చే ఏడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.