టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 46వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందనే అంశం ఇప్పటికీ ఎడతెగని సమస్యలా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ పక్కన బెట్టినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అలాగే రూట్ల ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెప్పిదంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో.. సమ్మెను కొనసాగించాలా..? లేక విరమించాలా.? అనే అంశంపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. కాగా, దీక్ష విరమించి, సడక్ బంద్‌ను వాయిదావేసిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి..లేబర్ కోర్టు తేల్చే వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. ఇకపోతే ఒకవేళ కార్మికులు సమ్మెను విరమిస్తే.. ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుంటుందా.? అసలు ఆర్టీసీ స్ట్రైక్ ముగింపు దారెటు.? అనే అంశాలపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు కాపీను మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ చదివి వినిపించగా.. ఆర్టీసీ జేఏసీ లీడర్ థామస్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి.. పలు కీలక వ్యాఖ్యలను చేశారు. కార్మికులను ఉద్యోగాల్లో చేరాలని ప్రభుత్వమే పిలవాలని ఆయన అన్నారు.కండిషన్స్ పెట్టి.. కార్మికులను ఉద్యోగాల్లో చేరాలని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. చట్టాలను వక్రీకరించకుండా నాన్- కండీషనల్‌గా కార్మికులను విధుల్లోకి చేరమని చెబితే.. తప్పకుండా కోర్టు తీర్పును గౌరవించి ముందుకు సాగుతామన్నారు. అంతేకాక గత రెండు నెలలుగా రాని జీతభత్యాలను ఇవ్వడమే కాకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తే.. ఈ 46 రోజుల సమ్మెకాలాన్ని పక్కనపెడతామని థామస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలా ఆర్టీసీ సమ్మె విషయం గురించి అయన ఏమన్నారో దిగువ వీడియోలో చూడండి…