తన పిల్లలను కలవడానికి అనుమతించలేదని ఆరోపిస్తూ, ఓ ఐపిఎస్ అధికారి తన మాజీ భార్య ఇంటి ముందు ఫుట్‌పాత్‌పై కూర్చుని శాంతియుతంగా నిరసన తెలిపారు. కలాబురాగి అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డి) పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న అరుణ్ రంగరాజన్, ప్రస్తుతం డిసిపి ర్యాంకు సాధించిన అతని మాజీ భార్య కొన్నేళ్ల క్రితం ఛత్తీస్‌ఘడ్‌లో కలిసి పనిచేస్తోన్న సమయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో పదే పదే బదిలీలు జరగడం, ఇతర అపార్థాల వల్ల విడాకులు తీసుకోవడానికి ఇరువురూ సమ్మతితోనే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారి విడాకుల పిటిషన్‌ను 2015 లో కోర్టు ఆమోదించింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
“నేను ఒక మీటింగ్ కోసం శుక్రవారం బెంగళూరుకు వచ్చాను. నా పిల్లలను కలవడానికి ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్నాను. నా మాజీ భార్య వసంత నగర్‌లో పిల్లలతో కలిసి నివసిస్తుంది. అక్కడికి వెళ్లిన నన్ను.. నా కొడుకు, కుమార్తెను కలవడానికి అనుమతించడం లేదు. నేను ఆమెను వేధిస్తున్నానని ఫిర్యాదు చేయడానికి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. నేను పిల్లలు గురించి పట్టించుకోవడం లేదని, వారిని కలవడానికి రావడం లేదని నా గురించి రూమర్స్ క్రియేట్ చేస్తుంది. ” అని రంగరాజన్ పేర్కొన్నారు.
అధికారిణి ఫిర్యాదుతో అక్కడి వచ్చిన లోకల్ పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరు తమ డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఉన్నతాధికారులు కావడంతో..సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.