దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లాక్ డౌన్ రీ ఓపెన్ తో తెరుచుకున్న పరిశ్రమల్లో కార్మికులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలూజ్, ఔరంగబాద్ ప్లాంట్‌లో 200 మందికి పైగా సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు మరణించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా, కంపెనీలో ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
జూన్ 6న మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. మొత్తం కంపెనీలో 8,100 మందికి పైగా ఉద్యోగుల పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువమందికి పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో కొందరు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించామని వారిలో కొందరికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇతర అనారోగ్యాలు కూడా తోడవ్వడంతో దురదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవి కైరాన్ రామసామి వివరించారు. ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని కొవిడ్ సోకినవారి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామన్నారు. అవసరమైనవారిని సెల్ఫ్ క్వారంటైన్ కు పంపించి సంస్థలో పూర్తి శానిటైజేషన్ చేస్తూ పారిశుద్ధ్యం లాంటి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు వైద్య సహాయంతో సహా అన్ని సహకారాన్ని అందిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు.