అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

|

Nov 02, 2020 | 4:58 PM

అసోం రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోక్ర‌ఝార్ జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు బలవన్మరణానికి పాల్ప‌డ్డారు.

అప్పుల బాధతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Follow us on

అసోం రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోక్ర‌ఝార్ జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు బలవన్మరణానికి పాల్ప‌డ్డారు. అసోం-ప‌శ్చిమ‌బెంగాల్ స‌రిహ‌ద్దులోని తుల్సిబిల్ ప‌ట్ట‌ణంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఈ దారుణం ఘటన వెలుగుచూసింది. సోమ‌వారం ఉద‌యం స్థానికులు చూసేస‌రికి ఇంట్లోని ఐదుగురు వ్య‌క్తులు సీలింగ్ వేలాడుతూ క‌నిపించార‌ని పోలీసులు తెలిపారు. తుల్సిబిల్ ప‌ట్ట‌ణానికి చెందిన‌ నిర్మ‌ల్‌పాల్ (45), మ‌ల్లిక (40) ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారికి పూజ (25), నేహ (17), దీప (15) అనే ముగ్గురు కూతుళ్లు. నిర్మ‌ల్ పాల్ గ్యాస్ సిలిండ‌ర్‌ల యూనిట్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, వ్యాపారంలో లావాదేవీల్లో తీవ్రంగా న‌ష్టాలు రావ‌డంతో భారీగా అప్పులు చేశాడు. సుమారు 25 నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పు అయ్యింద‌ని అత‌ని స‌మీప బంధువులు చెబుతున్నారు. త‌న స‌బ్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండ‌ర్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తాన‌ని చెప్పి ప్ర‌జ‌ల నుంచి నిర్మ‌ల్ పాల్ భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేశాడ‌ని, అనంత‌రం క‌రోనా విస్త‌రించ‌డం, లాక్‌డౌన్ కార‌ణంగా వ్యాపారం దెబ్బ‌తిన‌డంతో ఆర్థికంగా నష్టపోయాడని తోటి వ్యాపారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు.