కాశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరికి మద్దతునిస్తున్న టర్కీకి ప్రధాని మోదీ ఝలక్ ఇచ్చ్చారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తన ప్రసంగం పూర్తి అయిన వెంటనే ఆయన.. టర్కీ శత్రు దేశాలైన గ్రీస్, సైప్రస్, ఆర్మీనియా దేశాల నేతలతో భేటీ అయ్యారు. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ ను కలిసిన మోదీ.. మీ దేశ సార్వభౌమాధికారానికి భారత్ పూర్తి మద్దతునిస్తోందని స్పష్టం చేశారు. 1974 లో టర్కీ.. సైప్రస్ పై దాడి జరిపి.. ఆ దేశంలోని ఉత్తరభాగాన్ని చేజిక్కించుకుంది. దాన్ని ‘ టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ‘ గా ప్రకటించుకుంది. ఇందుకు సైప్రస్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగింది. తమ దేశానికి మోదీ మద్దతు ప్రకటించినందుకు నికోస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రీస్ ప్రధాని కిరియా కోస్ తోను మోడీ భేటీ అయ్యారు. ‘ ఏజియన్ ‘ సముద్ర జలాలకు సంబంధించి ఆధిపత్యంపై టర్కీ, గ్రీస్ దేశాల మధ్య చిరకాలంగా వైరం ఉంది. ఈ విషయంలో మీ వాదనకే తమ సపోర్ట్ అని మోదీ పేర్కొన్నారు. ఆర్మీనియా ప్రెసిడెంట్ నికోల్ ని కలిసిన సందర్భంలో ఆ దేశానికి కూడా భారత దేశ సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. ఒకప్పుడు లక్షలాది ఆర్మీనియన్ల ఊచకోతకు పాల్పడిన టర్కీ పట్ల ఈ దేశం కూడా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. కాశ్మీర్ విషయంలో భారత వైఖరికి ఈ మూడు దేశాల మద్దతును ఆయన కూడగట్టగలిగారు.