ఈ నెల 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నగరాన్ని తగులబెట్టించాలనుకున్నారని బీజేపీ నేత గౌతమ్ గంభీర్ ఆరోపించారు. ఆ రోజున నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలను ఆయన ఖండించలేదన్నారు. పంజాబ్ లో తమ పార్టీ ప్రయోజనాలకోసమే కేజ్రీవాల్ మౌనంగా ఉన్నారని గంభీర్ విమర్శించారు. పంజాబ్ లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సంగతి విదితమే.. ఇటీవల ఢిల్లీ అల్లర్లలో గాయపడిన పోలీసులను ఆసుపత్రిలో హోం మంత్రి అమిత్ షా పరామరిస్తున్న వీడియోను గౌతమ్ గంభీర్ రీట్వీట్ చేశారు.
అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఘటనలను ఖండిస్తూ ఆ తరువాత ట్వీట్ చేశారు. ఇది దురదృష్టకరమని, ఎవరు ఈ అల్లర్లకు బాధ్యులైనా కఠిన చర్యలు చేపట్టవలసిందేనని ఆయన అన్నారు. కానీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు తాము మద్దతునిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తాము మొదటినుంచీ ఈ విషయాన్ని చెబుతున్నామన్నారు.