తమ తమ రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత చంద్రబాబు, ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు పర్యటక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రతీ ఒక్కరికి తెలిసిందే. కానీ ఇపుడు ఓ ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు.. యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేందుకు చేస్తున్న కృషి, తీసుకుంటున్న రిస్క్ మాత్రం అంతా ఇంతా కాదు.
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో టూరిజంను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సీఎం పెమా ఖండూ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల ఘాట్ రోడ్డులో బైక్ మీద ఒంటరిగా 122 కి.మీ.లు ప్రయాణం చేసిన పెమా ఖండూ.. తాజాగా మరో పీట్‌లో సంచలనం సృష్టించారు. 15 వేల 600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో 107 కి.మీ.లు స్వయంగా ఆల్ టెరైన్ వాహనాన్ని నడిపారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ రైడ్‌లో పాల్గొనడం విశేషం.
ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో చైనా బోర్డర్‌కు అత్యంత దగ్గరగా వుండే తవాంగ్ జిల్లాలో పీటీఎస్వో లేక్ నుంచి మాంగో ఏరియా వరకు ఏటీవీని 107 కిలోమీటర్ల దూరం సీఎం పెమా ఖండూ నడుపుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసోపేతమైన ఈ రైడ్ తర్వాత సరిహద్దులోని జవాన్లతో పెమా ఖండూ, కిరణ్ రిజిజు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.