‘స్వచ్చంధ సంస్థ ముసుగులో మోసాలు.. ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు.. ఎట్టకేలకు కటకటాలపాలు

|

Nov 14, 2020 | 6:20 PM

మోసం కేసులో పీపుల్స్‌ ఎగెనెస్ట్‌ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

స్వచ్చంధ సంస్థ ముసుగులో మోసాలు.. ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు.. ఎట్టకేలకు కటకటాలపాలు
Follow us on

‘స్వచ్చంధ సంస్థ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఓ ఎన్ఆర్ఐను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసం కేసులో పీపుల్స్‌ ఎగెనెస్ట్‌ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి పీపుల్స్‌ ఎగెనెస్ట్‌ కరప్షన్‌ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. యూట్యూబ్‌ ఛానల్‌, ఫేస్‌బుక్‌లలో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ విజయబాబు తదితర ప్రముఖులను ఆహ్వానించేవారు. ప్రజా ఆకర్ష కోసం ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు నమ్మబలికాడు. దీంతో పలువురు దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే క్రమంలో మైదుకూరు మండలం శెట్టివారిపల్లెకు చెందిన అమెరికా ఎన్‌ఆర్‌ఐ రాజేష్‌కుమార్‌తో పరిచయం పెంచుకున్నారు. ఈ ఏడాది జులైలో కేంద్రం తరఫున లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద సామాజిక సేవా ప్రాజెక్టు మంజూరైనట్లు చెప్పారు. దీని గురించి ఏపీ సర్కార్ లోని పెద్దలతో చర్చిస్తున్నానంటూ రాజేష్‌కుమార్‌కు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ.50 కోట్లు, నిర్వహణ ఖర్చుల కింద 12 శాతం నిధులు ఇస్తారని, ఖర్చులన్నీ పోగా మూడుకోట్లు మిగులుతుందని ఆయనకు ఆశ కల్పించారు. దీన్ని నమ్మిన రాజేష్‌కుమార్‌ రూ.25 లక్షలు శ్రీకాంత్‌రెడ్డి బ్యాంకు అకౌంటుకు జమచేశారు.

రెండో దఫా అతని మామ కడప ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సీనియర్‌ మేనేజర్‌ వెంకటశివారెడ్డి ద్వారా రూ.10 లక్షలు అందజేశారు. ఈ డబ్బులతో శ్రీకాంత్‌రెడ్డి బంగారు ఆభరణాలు, కారు కొన్నారు. ప్రాజెక్టు విషయం గురించి శ్రీకాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు రాజేష్‌కుమార్‌ ప్రయత్నించగా.. స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తుంచాడు. దీంతో తన మామ ద్వారా ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు శ్రీకాంత్‌రెడ్డి అరెస్టు చేసినట్లు తెలిపారు