కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య పరీక్షల రేటును రూ.1600 నుంచి రూ. 800లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజి చొప్పున 16 మెడికల్ కాలేజీలు రూ. 7500 కోట్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని నాని తన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైద్యం నిమిత్తం 1563 బెడ్స్, ఆక్సిజన్ పైప్‌లైన్స్ కోసం రూ. 3.10 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోసం రు.10.20 కోట్లతో భవనాల నిర్మాణాలు చేపట్టామన్నారు. జిల్లాలో 12 వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.94.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.