వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్‌లో పలు కీలక మార్పులు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతలు, కేటగిరీల నిబంధనల్లో కొన్ని సవరణలు చేశారు. వితంతు, పెళ్లి అయ్యి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం సాగిస్తున్న మహిళలు కేటగిరి 2 కిందకు వస్తారని.. అంతేకాకుండా 45 ఏళ్ళులోపు ఉన్నవారు పెన్షన్‌కు అర్హులని స్పష్టం చేసింది. ఇకపోతే పిల్లలు లేని వితంతువులు, మైనర్ పిల్లలున్న వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరలా వివాహం చేసుకునే వరకు.. వీరందరికి పెన్షన్ అందుతుందన్నారు. ఇక ఈ కేటగిరి 2 తరపున పెన్షన్ తీసుకునేవారు.. కేటగిరి 1 పెన్షన్ కూడా తీసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతి చెంది.. వివాహం కానీ కూతురు ఉంటే.. ఆమెకు 25 ఏళ్ళు వచ్చేవరకు.. అంతేకాకుండా సొంతంగా ఉపాధి లభించేవరకు పెన్షన్ అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఆమెకు పెళ్లి అయ్యి.. ఆ తర్వాత కూడా పెన్షన్ పొందుతుంటే మాత్రం.. కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ఇలా పలు నిబంధనలను సవరించి.. వాటికి అనుగుణంగా ట్రెజరీ, పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.