అమరావతి: ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లను మంగళవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చెప్పారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు. హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్ ఉంటుంది. తెలంగాణలో పరీక్ష రాసే వారికి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో సెంటర్స్‌ను కేటాయించారు.
• ఇంజినీరింగ్ పరీక్ష ఈ నెల 20, 21, 22 తేదీల్లో 2 విడతలు, 23న ఉదయం ఒక విడత నిర్వహిస్తారు.
• వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24న 2 విడతలుగా నిర్వహిస్తారు.
ఏపీ ఎంసెట్-2019కి దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 2.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1.96 లక్షల మంది, మెడికల్‌కి 87 వేల మంది అప్లికేషన్‌లు సమర్పించారు. రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19 వరకు అవకాశం ఉంది. ఎంసెట్-ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష 7 సెషన్లుగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష 3 సెషన్లలో జరగనుంది. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్రానిక్ పరికరాలను అనుమతించబోమని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగే ఎంసెట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.