తెలంగాణలో వచ్చిన ఊపును… ఏపీలోనూ కొనసాగించేలా జనంలోకి దూసుకెళ్తున్నారు కమలదళం నేతలు. తెలంగాణలో వరుస విజయాల ఊపు ఏపీ కేడర్‌లోనూ కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. ఉరిమే ఉత్సాహాన్ని చూపుతున్నారు ఇక్కడి నేతలు. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందన్న నేపథ్యంలో ధర్నాలు, ఆందోళనలతో… జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా… గుంతల రోడ్లపై ఆందోళన చేశారు కమలం నేతలు.
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు బీజేపీ నేతలు. జగనన్న పాలనలో గుంతల రోడ్లు… ప్రజలకు తప్పని పాట్లు అంటూ… సిటీల్లో పబ్లిక్ అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి, విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరు, కడపలతో పాటు చాలా నగరాల్లో రోడ్ల దుస్థితిపై ధర్నాలు చేశారు. తిరుపతిలో ఉన్న గుంతల్లో పడవలు వేసి నిరసన తెలిపారు.
విజయవాడలో విష్ణువర్ధన్‌రెడ్డి ధర్నాలో పాల్గొంటే… కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నిరసన తెలిపారు. హెలికాఫ్టర్‌లో తిరుగుతున్న సీఎం జగన్… గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తే అసలు సంగతి తెలుస్తుందని సూచించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి. ఒకవైపు జనం దృష్టిని ఆకర్షిస్తూనే… మరోవైపు తిరుపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. తిరుపతిలో ఎలాగైనా తమ సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read :పశ్చిమగోదావరి జిల్లాలో భయానక పరిస్థితి.. పిట్టల్లా పడిపోతున్న జనాలు.. కారణమిదేనంటున్న వైద్యులు…