
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కీలక భేటి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అయ్యాయి.
ఇందులో భాగంగానే గతవారం విజయవాడలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నాలుగు దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని ప్రాధమిక చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోసారి భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో భేటి కావల్సి ఉండగా.. అది కాస్తా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీనితో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు మరొకొన్ని రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది.!