Another Youth ends Life in TS: అడిగింది ఆలస్యం.. ఎలాంటి పూచికత్తు లేకుండా డబ్బులిచ్చి ఆ తర్వాత రుణ గ్రహీతలను వేధింపులకు గురిచేస్తోన్న లోన్ యాప్‌ల భాగోతాలు ఇటీవల వెలుగులోకి వస్తోన్న విషయం తెలిసిందే. ఈ లోన్ యాప్‌ల వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు బయటకొచ్చాయి. పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టిసారించినా మరణాలు మాత్రం ఆగటం లేదు.
తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో మరో యువకుడు ఆన్‌లైన్ యాప్ వేధింపులు తాలలేక బలవన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన పరన్ కళ్యాణ్ రెడ్డి (24) అనే యువకుడు హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే ఇంట్లో వారికి చెప్పుకుండా లోన్ యాప్ ద్వారా కొంత అప్పు చేశాడు. అప్పు తీర్చాలని సదరు యాప్ నిర్వాహకులు కళ్యాణ్‌తో పాటు పూచికత్తు కోసం ఇచ్చిన మరో వ్యక్తికి కాల్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఎక్కడ ఇంట్లో తెలుస్తుందన్న భయంతో కళ్యాణ్ శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్ ఏ యాప్ ద్వారా ఎంత మొత్తంలో అప్పు తీసుకున్నాడు లాంటి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.