ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివిస్ లేబరేటరీస్ వ్యవహారం కొత్త చిచ్చు రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివిస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే.. దివిస్ ల్యాబ్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. దేశీయ ఫార్మారంగంలో దిగ్గజమైన దివిస్ ల్యాబరేటరీస్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి ప్రాంతంలో కొత్త యూనిట్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది.
టీడీపీ హయాంలోనే ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో రెండు పార్టీలు కూడా తమ స్టాండ్ మార్చేశాయి. ప్రస్తుతం వైసీపీ దివిస్ కు సై అంటుంటే.. టీడీపీ మాత్రం నై అంటోంది. అయితే, స్థానికులు మాత్రం తొండంగి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో తీరానికి సమీపంగా ఉంటుంది.. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.