ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ‘అమ్మ ఒడి’, మధ్యాహ్న భోజనం పథకాలపై విసృత చర్చ జరిగింది. వీటిపై సీఎం జగన్ ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నూతన పేరును పెడుతున్నట్లు పేర్కొన్నారు. పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన కొత్త మెనూను నేటి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అన్నం పెట్టే ఆయాల గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి 3 వేలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి చదువు చెప్పడమే కాదు, మంచి భోజనం పెట్టే బాధ్యతను కూడా చూసుకుంటామని హామి ఇచ్చారు. భోజనంలో నాణ్యత పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీలో ఉండే ముగ్గురు అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే విద్య, సంక్షేమ అధికారితో పాటు ఆర్డీవో స్థాయి ఆఫీసర్ కూడా నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
‘జగనన్న గోరుముద్ద’ పథకం నూతన మెనూ ఇదే:
సోమవారం : అన్నం, గుడ్డు కూర, చిక్పీ
మంగళవారం: పులిహోర, టామాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు
బుధవారం : వెజిటెబుల్ రైస్, ఆలూ కూర్మ, ఉడకబెట్టిన గుడ్డు, చిక్పీ
గురువారం: కిచిడి, టామాట చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఉడకబెట్టిన గుడ్డు, చిక్పీ, తోటకూర కాడలతో వండిన పదార్థం
శనివారం: అన్నం, సాంబార్, స్వీట్ పొంగల్