An accused arrested after 38 years: ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు 38 ఏళ్ల క్రితం హత్యచేసి, పరారైన నిందితుడు ఎట్టకేలకు ఒక హనుమాన్ దేవాలయంలో సాధువు వేషంలో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. జిన్సీ మీణా అనే వ్యక్తి భూ వివాదాల నేపధ్యంలో 38 ఏళ్ల క్రితం తన పొరుగింట్లో ఉండే ఒక వ్యక్తిని హత్యచేసి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం వెదుకులాటసాగిస్తున్నారు. ఎట్టకేలకు కరౌలి పోలీసులు అతని ఆచూకీ కనుక్కొని అరెస్టు చేయగలిగారు.
వివరాల్లోకెళితే.. గంగాపూర్ ప్రాంతానికి చెందిన జిన్సీ మీణా అనే వ్యక్తి శ్రీమాన్ మీణా హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఈ హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో సాధువు వేషంలో కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ప్రస్తుతం గంగాపూర్ లోని హనుమాన్ దేవాలయం వద్ద సాధువు వేషంలో ఉన్న ఇతనిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.