Images of Novel Coronavirus : కరోనా.. కోవిడ్-19 ఇలా ఉంటుందని పెయింటింగ్ చిత్రాలు చూశాం. అయితే ఇప్పుడు సైంటిస్టులు వాటి ఫోటోలను విడుదల చేశారు. ఇదిగో కరోనా మహమ్మారి ఇలా ఉంటుంది అని ఓ మైక్రోస్కోపిక్ చిత్రాలను విడుదల చేశారు పరిశోధకులు.
గతంలో మనం చూసినవాటికి భిన్నంగా ఉండే మరో కొత్త కరోనా ఫోటోలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ విడుదల చేసింది. అయితే.. శ్వాసకోశ కణాలకు కరోనా సోకితే ఎలా ఉంటుందో ఫోటోలు తెలియజేస్తున్నాయి. వీటిని స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానంలో శాస్త్రవేత్తలు చిత్రాలు తీశారు.
కరోనా మహమ్మారి సోకిన బాధితుడి నుంచి 96 గంటల తర్వాత ఈ చిత్రాలను చిత్రీకరించారు. ఇది వైరస్ కణాలు శరీరమంతటా పాకి, ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపారు. ఈ ఫోటోలు మొదట బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన తర్వాత వాటికి రంగులద్ది చిత్రాలను విడుదల చేశారు.
ఈ కణాలు మొదట శ్వాసకోశ నాళాల్లోని శ్లేష్మంతో చేరి, వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర శరీర భాగాలకు వ్యాపించేలా చేస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఫోటోలు చూసి అయినా అందరూ జాగ్రత్తపడాలి అంటున్నారు శాస్త్రవేత్తలు.