అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లకు వ్యతిరేకంగా చాలా రోజులుగా తెలుగు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు, వీటి ప్రభావం వల్ల ప్రేక్షకులు ధియేటర్లలోకి రావడం తగ్గించారంటూ ఇప్పటికే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అయితే, ప్రొడ్యూసర్లందరికీ ప్రైమ్ నుండి మరో షాకింగ్ వార్త అందింది. ఈ మధ్యే టాలీవుడ్ పెద్ద చిత్రాలు సాహో, సైరా చిత్రాలకు అంత పెద్దగా స్పందన లేకపోవడం..వ్యూవర్స్ కూడా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రైమ్ కు నష్టాలు వాటిల్లాయి. దీంతో భారీ మొత్తంలో ఖర్చు చేసి కొనుకున్న ఈ సినిమాల డిజిటల్ రైట్స్, ప్రైమ్ నిర్వాహకులకు లాస్ ను తెచ్చి పెట్టాయి . ఇటు తెలుగులోనే కాదు, ఇతర భాషలలో కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రైమ్ లో కొత్త బిజినెస్ ప్లాన్ ను అమలులోని తేనున్నారు..
ప్రస్తుతం సినిమాలకు ఇస్తున్న రేట్లను అమాంతం తగ్గించడమే కాకుండా.. పెర్ వ్యూ మోడల్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే, ప్రేక్షకులు చూసిన వ్యూస్ ప్రకారం వారికి పేమెంట్ ఇవ్వడం అనమాట. ఈ ప్లాన్ గనక ఆచరణలోకి వస్తే, నిర్మాతలకు అసలైన కష్టాలు మొదలవుతాయి. డిజిటల్ మార్కెట్ లాభాలు బావున్నాయన్న కారణంతోనే పెద్ద సినిమాలు బడ్జెట్ ను విపరీతంగా పెంచుకుంటున్నాయి. ఈ మార్కెట్ ఉందన్న ధైర్యంతోనే ఎన్నో చిన్న సినిమాలు రూపొందుతున్నాయి. మరి, ఈ సరికొత్త ప్లాన్ తో సినిమాల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.