Alexa Will Talk In Telugu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (కృత్రిమమేధ) అందుబాటులోకి వచ్చాక వర్చువల్ అసిస్టెంట్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాయిస్ కమాండ్ ఆధారంగా పాటలు నుంచి వార్తల వరకు అన్ని వివరాలు చెప్పే ఈ అసిస్టెంట్‌లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న అలెక్సా ఇకపై తెలుగులోనూ సమాచారాన్ని అందించనుంది.
తెలుగులో సంభాషించే అలెక్సాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ అభివృద్ధి చేసింది. టెక్నాలజీలో ప్రాంతీయ భాషలను భాగస్వామ్యం చేయడానికి ఐఐటీ హైదరాబాద్‌లో ‘బహు భాషక్’ పేరిట లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు డేటా సెట్లు కేవలం హిందీ, ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉండగా.. ప్రాంతీయ భాషల్లో తెలుగు మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయమై ఐఐటీ ప్రొఫెసర్ ప్రకాశ్ ఎల్లా మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ భాషల్లో డాటాసెట్లు తయారుచేయడంతో భాషాపరమైన సమస్యలను అధిగమించినట్లవుతుంది. కృత్రిమ మేధస్సు గల ఈ డాటాసెట్‌లో ఎంత డేటా నిక్షిప్తం చేస్తే అంత సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మేము పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలుగులో 2వేల గంటలపాటు పనిచేసే డాటాసెట్‌ను తయారుచేశాం. ఇతర ప్రాంతీయ భాషల్లోనూ డేటా సెట్ల తయారీకి సహకారం అందిస్తాం’ అని చెప్పుకొచ్చారు.