
ఉల్లి, వెల్లుల్లి, కూరగాయల రేట్లు పెరిగి సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలిసిందే. వాటి నుంచి ఇంకా కోలుకోకముందే మరో బాంబ్ పేలింది. వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. భారీ వర్షాల ప్రభావంతో నూనె గింజల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పడిపోవడంతో..డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
పామాయిల్ ధరను గమనిస్తే..గత వారం లీటరు రూ. 68 ఉన్నది కాస్తా ఇప్పుడు రూ. 86కు చేరుకుంది. ఇటీవల 2, 3 నెలల కాలంలోనే పామాయిల్ ధర రూ. 20 వరకు పెరగడం గమనార్హం. ఆయిల్ ఫెడ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక నెల గ్యాప్‌లోనే వంట నూనె ధర రూ. 8 వరకు పెరిగిందని తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన విత్తనాల గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నూనెగింజల పంటల విస్తీర్ణం 68.24 లక్షల హెక్టార్లలో ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.47 లక్షల హెక్టార్లలో తక్కువ. మరోవైపు.. సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సోపా) అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సోయాబీన్ ఉత్పత్తి 89.94 లక్షల టన్నులు, ఇది గతేడాది 109.33 లక్షల టన్నుల ఉత్పత్తి కంటే 71.73 శాతం తక్కువ. ఇలా స్వదేశంలో ఉత్పత్తి తగ్గిపోవడం..మలేషియా, ఇండోనేషియాల నుంచి దిగుమతుల శుంకాలు భారీగా పెరగడమే ఈ ధరల్లో ఈ అనూహ్య మార్పులకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.