ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖంగుతిన్న కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. గత మూడు నాలుగు రోజుల నుంచి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇంకా కర్ణాటకలో గొడవ సద్దుమణుగక ముందే మరో భారీ ఝలక్ ఇచ్చారు గోవా ఎమ్మెల్యేలు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు.. ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడి అధికార బీజేపీలో శాసనసభాపక్షం విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసింది. ఈ విషయాన్ని స్పీకర్ సైతం ధ్రువీకరించారు. బీజేపీ బలం పెరిగినట్లు అటు సీఎం కూడా లేఖ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. మరోవైపు వీరి చేరికతో బీజేపీ ప్రభుత్వ బలం 27కి చేరింది.