న్యూఢిల్లీ : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. యోగి ఆదిత్యనాథ్ 72 గంటల పాటు, మాయావతి 48 గంటల పాటు ప్రచారం చేయకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నెల 7వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, మాయావతి మతపరమైన, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు. మీకు అలీ ఉంటే మాకు బజరంగ్‌బలి ఉన్నారని యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మాయావతి స్పందిస్తూ మత ప్రాతిపదికపైనే బీజేపీ టికెట్లు ఇస్తోందన్నారు. యోగికి ఓట్లు వేసేటప్పుడు అలీ, బజరంగ్‌బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ముస్లింలు దృష్టిలో ఉంచుకోవాలని మాయావతి అన్నారు.అయితే ఈ ఇద్దరి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో యోగీ, మాయావతిపై ఈసీ చర్యలు తీసుకుంంది. యోగి 3 రోజులు, మాయావతి 2 రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేలా ఈసీ నిషేధం విధించింది.