ఇది కదా మానవత్వం అంటే.. తానూ చనిపోతూ.. నలుగురికి జీవితాన్నిచ్చిన యువకుడు!

| Edited By: Balaraju Goud

Nov 15, 2024 | 10:49 AM

చెన్నై నుండి వచ్చిన జీవన్ దాన్ సభ్యులు విజయనగరం చేరుకొని సాయికుమార్ హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్, కళ్లు సేకరించారు.

ఇది కదా మానవత్వం అంటే.. తానూ చనిపోతూ.. నలుగురికి జీవితాన్నిచ్చిన యువకుడు!
Organs Donation
Follow us on

సమయం ఉదయం తొమ్మిది గంటలు. ఆసుపత్రి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. జనమంతా పెద్దఎత్తున గుమికూడారు. ఓ వైపు అంబులెన్సుల సైరన్లు మారుమ్రోగుతున్నాయి. అదంతా చూస్తున్న అక్కడ వారికి ఏం జరుగుతుందో తెలియని అయోమయం..! పోలీసుల హడావుడి చూసి అక్కడ వారంతా కంగారు కంగారుగా ఉన్నారు.

ఇంతలో ఆసుపత్రిలో నుండి పలువురు యువకులు హడావుడిగా మూడు బాక్సులు తీసుకుని వచ్చి వాటితో అంబులెన్స్ ఎక్కారు. వెంటనే పోలీసుల ఎస్కార్ట్ వాహనం సైరన్ వేసుకుంటూ స్పీడ్ గా కదిలింది. ఆ ఎస్కార్ట్ వాహనం వెంటే మరో రెండు అంబులెన్స్ లు అంతే స్పీడుగా బయలుదేరాయి. దీంతో పోలీసులు కూడా అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ ప్రాంతం అంతా మెల్లగా జన రద్దీ తగ్గి సాధారణ పరిస్థితికి వచ్చింది. అసలు ఏంటి ఇంత హడావుడి? ఏం జరిగిందని ఒకరికి ఒకరు మెల్లగా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

అప్పుడే తెలిసింది ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి అవయవాలు గ్రీన్ ఛానల్ లో చెన్నైకి తరలిస్తున్నారని, అందుకోసం స్థానిక వైద్యులు, పోలీసులు సహకరించారని తెలిసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసకి చెందిన లంకెన సాయికుమార్ మక్కువ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాయికుమార్ ను హుటాహుటిన విజయనగరంలోని తిరుమల మెడికవర్ కు తరలించారు బంధువులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించాడు సాయికుమార్. సాయికుమార్ మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అయితే బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన సాయికుమార్ అవయవాలు పలువురికి నూతన జీవితాన్నిస్తాయని గమనించిన ఆసుపత్రి వైద్యులు జీవన్ దాన్ కు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా సాయికుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి సంబందించిన అవగాహన కల్పించారు. సాయికుమార్ లేకపోయినా అతని అవయవాలు కొందరికి జీవితాన్నిస్తాయని భావించిన కుటుంబసభ్యులు, అతని అవయవాలు ఉన్న వ్యక్తుల్లో తమ సాయికుమార్ ను చూసుకోవచ్చని భావించి అవయవదానానికి అంగీకరించారు.

వెంటనే చెన్నై నుండి వచ్చిన జీవన్ దాన్ సభ్యులు విజయనగరం చేరుకొని సాయికుమార్ హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్, కళ్లు సేకరించారు. అనంతరం విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వైజాగ్ ఎయిర్ పోర్ట్ వరకు ట్రాఫిక్ తో ఎలాంటి ఆలస్యం కాకుండా అంబులెన్స్ లకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటుచేసి సహకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ మాట్లాడుతూ అవయువదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి నూతన జీవితాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..