
వ్యక్తిగత సమస్యలతో మనస్తాపం చెంది నదిలోకి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. నీటిలో దూకిన వెంటనే ఆమెపై మొసలి దాడి చేయడంతో భయంతో కేకలు వేసింది. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను సురక్షితంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో బుధవారం రాత్రి కుక్కే సుబ్రహ్మణ్య పరిసరాల్లోని కుమారధార వంతెన వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె నదిలోకి దూకేసింది. అయితే, ఆమె నీటిలో ఉండగానే ఒక్కసారిగా ఓ మొసలి వచ్చి దాడి చేసింది. అనుకోని దాడితో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది.
రాత్రి సమయంలో నది నుంచి వినిపించిన మహిళ ఆర్తనాదాలను సమీపంలోని ఓ లాడ్జి సిబ్బంది గమనించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు వెంటనే సుబ్రహ్మణ్య పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక నివాసితుల సహాయంతో నదిలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను నీటిలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మొసలి దాడి కారణంగా సదరు మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకవేళ స్థానికులు ఆమె కేకలు విని స్పందించకపోయుంటే పెను విషాదం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు.
మహిళను రక్షించిన అనంతరం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్ర మనస్తాపంలో ఉన్న ఆమెకు పోలీసులు తొలుత కౌన్సిలింగ్ నిర్వహించారు. జీవితం ఎంతో విలువైందని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె బంధువులు రావడంతో వారితో పాటు క్షేమంగా ఇంటికి పంపించివేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య వద్ద కుమారధార నదిలో మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో నదిలోకి దిగడం ప్రాణాంతకమని స్థానిక అధికారులు, పోలీసులు భక్తులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.