
తడిగా ఉండే వాతావరణంలో పాములకు సురక్షితమైన ప్రదేశాల అవసరం పెరుగుతుంది. పొలాలు, బురద నీరు నిలిచే చోట్లు పాములకు ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే అవి ఇంటి వైపు, ముఖ్యంగా పొడిగా, వెచ్చగా ఉండే చోట్లకి కదులుతాయి. మీరు తలుపులు, కిటికీలు మూసినా.. చిన్న రంధ్రాల ద్వారా అవి లోపలికి రావడానికి దారులు వెతుకుతాయి.
మన ఇంట్లో బియ్యం, గోధుమలు, పప్పులు లాంటివి తెరిచి ఉంచితే.. అవి ఎలుకలను ఆకర్షిస్తాయి. ఎలుకల కోసం పాములు అక్కడికి వచ్చి ఇంట్లోకి వస్తాయి. అలాగే వంటింట్లో చెత్త డబ్బాను తెరిచి ఉంచడం.. అందులో తడి ఆహార ముక్కలు ఉండడం కూడా ఇదే సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలను మూసివేయడం. చెత్తను రోజూ బయట పారేయడం చాలా అవసరం.
పాములకు నీరు అవసరం. ఇంట్లో తడిగా ఉండే చోట్లు, ముఖ్యంగా వంటింట్లో లేదా బాత్రూంలో నీరు నిలిచే చోట్లు, వాటికి ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంటాయి. అవి దాక్కునే చోటు అవుతాయి. సింక్ కింద ఉండే నీటి చుక్కలు లేదా పైపు లీకేజీలు వాటిని ఆకర్షించవచ్చు. కాబట్టి ఇలాంటివి కనిపిస్తే వెంటనే బాగు చేయాలి.
చేపలు, మాంసం, గుడ్లు లాంటివి వండిన తర్వాత వాటి వాసనలు ఎలుకలు, కప్పలు లాంటి చిన్న జీవులను ఆకర్షిస్తాయి. అవే పాములకు ప్రధాన ఆహారం. కాబట్టి పాములు కూడా వెంటనే ఆ ప్రదేశానికి వస్తాయి. అందు వల్ల ఈ రకం ఆహార పదార్థాలను వెంటనే పారవేయడం లేదా బాగా మూసిపెట్టడం ముఖ్యం.
ఇంట్లో నిశ్శబ్దంగా ఉండే మూలలు, తడిగా ఉండే మూలల్లో దుమ్ము తీయకుండా ఉంచితే.. అవి పాములకు దాక్కునే ప్రదేశాలుగా మారతాయి. కాబట్టి ఇంటిలోని ప్రతి మూలనూ తరచూ శుభ్రం చేయడం తప్పనిసరి.
పాములు మనకు ప్రమాదకరమైన జీవులు. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. వాటి నుంచి మన ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, తడిని అదుపు చేయడం, సహజ నివారణలు వాడడం ద్వారా వర్షాకాలంలో కూడా మీరు పాముల బెదిరింపుల నుంచి దూరంగా ఉండగలుగుతారు.