చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుంది.. దాన్ని వెనకున్న మిస్టరీ ఏంటంటే..?

చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుంది..? మనల్ని మనం అనుకున్నప్పుడు ఎందుకు నవ్వు రాదు..? దీని వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఇది కేవలం నవ్వు మాత్రమే కాదు.. మన మెదడు ఆడే ఒక వింతైన ఆట. దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుంది.. దాన్ని వెనకున్న మిస్టరీ ఏంటంటే..?
The Science Of Tickling

Updated on: Jan 10, 2026 | 8:55 PM

చక్కిలిగింతలు.. ఇది ఒక వింతైన అనుభూతి. ఎదుటివారు చక్కిలిగింతలు పెడుతుంటే మనం ఆపమని చెప్తూనే పగలబడి నవ్వుతాం. అసలు మనం నవ్వకూడదు అనుకున్నా మన శరీరం ఎందుకు స్పందిస్తుంది..? మనల్ని మనం చక్కిలిగింతలు పెట్టుకుంటే నవ్వు ఎందుకు రాదు..? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

నవ్వు మాత్రమే కాదు..

చాలా కాలం వరకు చక్కిలిగింతలు పెట్టడం అనేది కేవలం ఒక సరదా చర్య అని అందరూ భావించేవారు. కానీ సైంటిస్టుల పరిశోధనలో ఇది మానవ సంబంధాలను బలోపేతం చేసే ఒక సోషల్ గ్లూ అని తేలింది. కేవలం మనుషులకే కాదు, ఎలుకలకు కూడా చక్కిలిగింతలు పెట్టినప్పుడు అవి ఆనందంతో కూడిన శబ్దాలు చేస్తాయని PLOS One అధ్యయనం వెల్లడించింది. భాష పుట్టకముందే, స్పర్శ ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఈ చక్కిలిగింతలు ఉపయోగపడేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నవ్వుకీ భయానికీ మధ్య జరిగే యుద్ధం

మన శరీరంలో మెడ, పక్కటెముకలు, కడుపు వంటి ప్రాంతాలు చాలా సున్నితమైనవి. ఎవరైనా అక్కడ తాకినప్పుడు మన నాడీ వ్యవస్థ మొదట ముప్పుగా భావించి ఉలిక్కిపడుతుంది. అయితే మనల్ని తాకిన వ్యక్తి మనకు తెలిసిన వారేనని, వారి వల్ల ప్రమాదం లేదని మెదడు గుర్తించిన మిల్లీసెకన్లలో ఆ భయం కాస్తా నవ్వుగా మారుతుంది. అంటే ఆ నవ్వు నేను నీతో సురక్షితంగా ఉన్నాను అని ఎదుటివారికి ఇచ్చే ఒక నిశ్శబ్ద సంకేతం.

ఇవి కూడా చదవండి

మనల్ని మనం ఎందుకు చక్కిలిగింతలు పెట్టుకోలేం?

మనల్ని మనం చక్కిలిగింతలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. ఎందుకంటే.. మన మెదడు మనం చేసే ప్రతి కదలికను మిల్లీసెకన్ల ముందే ఊహిస్తుంది. చక్కిలిగింతల్లో ఆశ్చర్యం ఉంటేనే ప్రతిస్పందన ఉంటుంది. మన మెదడుకు మనం ఏం చేస్తున్నామో ముందే తెలుసు కాబట్టి అది ఆ ప్రతిచర్యను నిలిపివేస్తుంది.

మనుగడకు పునాది.. నమ్మకానికి పరీక్ష

చక్కిలిగింతలు పెట్టడం అనేది ఒక విశ్వాస పరీక్ష. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎవరి దగ్గరైతే సురక్షితంగా భావిస్తామో వారి దగ్గరే మనకు ఎక్కువగా చక్కిలిగింతలు వస్తాయి. . అందుకే మనం అపరిచితుల వద్ద కంటే మనకు ఇష్టమైన వారు, కుటుంబ సభ్యుల దగ్గరే ఎక్కువగా నవ్వుతాం. నమ్మకం లేని చోట చక్కిలిగింతలు పెడితే నవ్వు రాదు.. అసౌకర్యం కలుగుతుంది. ఇది మనల్ని ఇతరులతో కలిపే ఒక అద్భుతమైన సహజమైన స్పందన.

నేటి ఆధునిక కాలంలో ఎన్ని మార్పులు వచ్చినా, మన నాడీ వ్యవస్థ మాత్రం పురాతనమైన బంధాలనే కోరుకుంటుంది. చక్కిలిగింతలు పెట్టడం ద్వారా వచ్చే నవ్వు కుటుంబాలు, స్నేహితుల మధ్య బంధాన్ని పెంచుతుంది. ఇది మానవులు ఒంటరిగా కాకుండా స్పర్శ, ఆటల ద్వారా కలిసి జీవించాలని ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..