Ration Card: పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి జాతీయ ఆహార భద్రతా పథకం. ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార ధాన్యాలు అందిస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. అయితే దేశంలో చాలా కుటుంబాలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. కానీ చాలామంది అనర్హులు రేషన్ కార్డు పొందారు. దీంతో త్వరలో కొత్త నిబంధనలు అమలుకాబోతున్నాయి.
చాలా మంది అనర్హులు రేషన్‌కార్డు కలిగి ఉండి నిబంధనలకు విరుద్దంగా సరుకులు తీసుకుంటున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అనర్హులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరగినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల ప్రతిపాదనలను, సూచనలను పరిగణలోకి తీసుకొని కేంద్రం త్వరలో కొత్త నిబంధనలను జారీ చేయనుంది. పేదలకు మాత్రమే రేషన్ కార్డు అత్యంత అవసరం. కానీ ఆర్థికంగా ఉన్నవారు కూడా చాలామంది రేషన్ కార్డుని కలిగి ఉన్నారు. కొత్త రూల్స్ వస్తే ఇలాంటి వారికి ఇక రేషన్ కార్డు ఉండదు.
రేషన్ కార్డు మనకి ఉండే ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. ఆధార్ కార్డు, పాన్‌కార్డు మాదిరి రేషన్ కార్డు కూడా. ఇది ఉంటే ప్రభుత్వం అందించే సబ్సిడీపై నిత్యావసర సరుకులను పొందవచ్చు. ఇంకా చాలా రకాల ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు అవుతారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలన్నా, కార్డును పునరుద్ధరించాలన్నా, కొత్త సభ్యుడి పేరును చేర్చాలన్నా, దాదాపు 10 రకాల పత్రాలు అవసరం. కొత్త సాఫ్ట్‌వేర్ కారణంగా ఇది జరిగిందని నివేదికలలో చెబుతున్నారు. జిల్లా సరఫరా అధికారుల ప్రకారం.. జాతీయ ఆహార భద్రతా పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని ద్వారా రేషన్ కార్డులు జారీ చేస్తారు.