ఒక్క ముళ్ల పంది శరీరంపై ఎన్ని వేల ముళ్లు ఉంటాయో తెల్సా..? ఇది భలే ఈతగాడు కూడా

చిన్నదే అయినా ధైర్యంలో పెద్ద పెద్ద మృగాలకు సవాల్ విసిరే జంతువు ముళ్ల పంది. వేలాది పదునైన ముళ్లతో తనను తాను రక్షించుకునే ఈ జీవి గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...

ఒక్క ముళ్ల పంది శరీరంపై ఎన్ని వేల ముళ్లు ఉంటాయో తెల్సా..? ఇది భలే ఈతగాడు కూడా
Porcupine

Updated on: May 30, 2026 | 5:49 PM

అడవిలో సింహం, పులి, చిరుత వంటి క్రూర జంతువులు రాజులుగా పేరొందినా.. వాటికీ భయపెట్టగలిగే ఒక చిన్న జీవి ఉంది. అదే ముళ్ల పంది . శరీరమంతా పదునైన ముళ్లతో కప్పబడి ఉండే ఈ జంతువు తన రక్షణలో దిట్ట. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ముళ్ల పంది.. ప్రమాదం ఎదురైతే మాత్రం పెద్ద పెద్ద మృగాలతో కూడా తలపడుతుంది.

ముళ్ల పంది స్వయంగా వేటాడదు. కానీ తనపై దాడి చేసే చిరుతలు, అడవి కుక్కలు, తోడేళ్లు, హైనాలు, కొన్నిసార్లు సింహాలు, పులులు వంటి మృగాల నుంచి ధైర్యంగా ఎదురుదాడి చేస్తుంది. ప్రమాదం అనిపిస్తే తన వెన్నుపైన ఉన్న వేలాది ముళ్లను నిటారుగా నిలబెట్టి వెనక్కి దూసుకెళ్తుంది. ఆ ముళ్లు ప్రత్యర్థి శరీరంలో గుచ్చుకుంటే తీవ్రమైన గాయాలు అవుతాయి.

ముళ్ల పంది ప్రధానంగా శాకాహారి. చెట్ల బెరడు, ఆకులు, వేర్లు, పండ్లు, కూరగాయలు, గడ్డి విత్తనాలు తింటుంది. కొన్ని సందర్భాల్లో కాల్షియం, ఖనిజాల కోసం ఎక్కడైనా కనిపించిన జంతువుల ఎముకలను కూడా కొరుకుతుంది.

ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు:

1. ముళ్లు బాణాల్లా ఎగరవు!

చాలామంది ముళ్ల పంది తన ముళ్లను శత్రువుపైకి విసురుతుందని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ముళ్లు ఎగరవు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు గుచ్చుకుంటాయి.

2. ఒక ముళ్ల పందికి 30 వేలకుపైగా ముళ్లు ఉంటాయి

దాని శరీరంపై వేలాది ముళ్లు ఉంటాయి. కొన్ని జాతుల్లో 30,000 వరకు ముళ్లు ఉన్నట్లు తేలింది

3. ముళ్లు మళ్లీ పెరుగుతాయి

గుచ్చుకున్నప్పుడు లేదా ఊడిపోయినప్పుడు కొత్త ముళ్లు తిరిగి పెరుగుతాయి.

4. అద్భుతమైన ఈతగాడు

ముళ్ల పంది నేలపైనే కాకుండా నీటిలో కూడా బాగా ఈదగలదు. ముళ్లలోని ఖాళీలు దానికి తేలికనిస్తాయి.

5. రాత్రివేళలే ఎక్కువ చురుకుగా ఉంటుంది

ఇది ప్రధానంగా రాత్రిపూట ఆహారం కోసం బయటకు వస్తుంది. పగటిపూట బొరియల్లో లేదా రాళ్ల సందుల్లో విశ్రాంతి తీసుకుంటుంది.

6. పుట్టిన పిల్లలకు కూడా ముళ్లు ఉంటాయి

కొత్తగా పుట్టిన పిల్లలకు ముళ్లు మెత్తగా ఉంటాయి. కొన్ని గంటల్లోనే అవి గట్టిపడి రక్షణ కవచంగా మారతాయి.

7. దంతాలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి

ఎలుకల మాదిరిగానే ముళ్ల పంది ముందు పళ్లు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అందుకే చెక్కలు, బెరడులు కొరుకుతూ వాటిని నియంత్రిస్తుంది.

8. ప్రేమలో మాత్రం చాలా నిబద్ధత

చాలా ముళ్ల పంది జాతులు ఒకే జతతో చాలా కాలం కలిసి జీవిస్తాయి.

ప్రకృతిలో ఒక అద్భుత రక్షణ వ్యవస్థ

పులి, చిరుత వంటి శక్తివంతమైన మృగాలు కూడా ముళ్ల పందిని వేటాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ముళ్లు ముఖం లేదా కాళ్లలో గుచ్చుకుంటే వాటి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే అడవిలో ముళ్ల పందిని ప్రకృతి తయారు చేసిన సజీవ కవచం అని పిలుస్తారు.

 

Follow Us