
శ్రావణ మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే పూజా ఫలితం దక్కదు. శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం.
నిలబడి అభిషేకం చేయకూడదు: శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి నీరు పోయకూడదు. ఎందుకంటే ఇది అగౌరవానికి సంకేతం. కాబట్టి, కూర్చుని లేదా కొద్దిగా వంగి అభిషేకం చేయడం మంచిది.
శంఖాన్ని ఉపయోగించకూడదు: శివపూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. పురాణాల ప్రకారం, శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అతని ఎముకల నుంచే శంఖం ఏర్పడిందని చెబుతారు. అందుకే శివారాధనలో శంఖాన్ని వాడకూడదు.
రాగి పాత్రలో పాలు పోయకూడదు: రాగి పాత్రతో నీటి అభిషేకం చేయడం శ్రేయస్కరం. కానీ, పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రను ఉపయోగించకూడదు. రాగి పాత్రతో పాలు అభిషేకం చేస్తే అవి హానికరం అవుతాయి.
పగటిపూట మాత్రమే అభిషేకం: శివలింగానికి జలాభిషేకం చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య సమయం చాలా శుభప్రదమని పండితులు చెబుతారు. సాయంత్రం వేళలో అభిషేకం చేయడం మంచిది కాదు.
నీటి ధార ఆగకూడదు: శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు నీటి ధార నిరంతరంగా ఉండాలి. ధార మధ్యలో ఆగిపోకూడదు. సన్నటి ధార అయినా పర్వాలేదు, కానీ నిరంతరంగా ప్రవహిస్తూ ఉండాలి.
తూర్పు లేదా దక్షిణం వైపు నుంచి వద్దు: అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ శివలింగానికి ఉత్తరం వైపున నిలబడి చేయాలి. శివుడికి ఎడమవైపు పార్వతి దేవి ఉంటుంది కాబట్టి, ఉత్తర ముఖంగా అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది.
తులసి ఆకులను వాడకూడదు: తులసి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది కాబట్టి, శివలింగానికి తులసితో పూజ చేయకూడదు. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పువ్వులు వంటివి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ నియమాలను పాటించడం ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, పూజకు సంపూర్ణ ఫలితం పొందవచ్చు.